అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలివ్వాలి
జగిత్యాల: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలివ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ద్వావర సంజీవ రాజు, కార్యదర్శి సోమా జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాలలో సోమవారం నాడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డిమాండ్స్ డే నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శులు ద్యావర సంజీవరాజు, సోమా జీవన్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎన్. జయపాల్, ఉపాధ్యక్షుడు కట్కూరి మల్లేషం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు పొన్నం లావణ్య, మాకు రాజలింగం, బొద్దున రవి కుమార్, రవీందర్ రావు, కుసుంబ శ్రీనివాస్, ఆముద లింగా రెడ్డి, మామిడిపెళ్లి లక్ష్మణ్, సాయి కుమార్, ఆంజనేయులు, కరుణాకర్ పాల్గొన్నారు. అంతకుముందు ఫెడరేషన్ నాయకులు, సభ్యులు ఐ యం ఏ భవన్ నుండి ప్లకార్డులతో కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి జర్నలిస్టుల డిమాండ్స్ కూడిన వినతిపత్రంను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అనంతరం అధ్యక్షుడు ద్యావర సంజీవ రాజు, కార్యదర్శి సోమా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, లేదా ఇళ్ళస్థలాలివ్వాలని, విలేకరిగా పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. జర్నలిస్టులపై దాడుల నిరోధానికి జిల్లా రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని, కరోనా పాజిటివ్ వున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని, రాష్ట్రస్థాయి మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, మీడియా అకాడమీకి బడ్జెట్ పెంచాలని కోరారు. సమాచార శాఖకు పూర్తి స్థాయి కమీషనర్ నియమించాలన్నారు. పత్రికా కార్యాలయాల్లో మహిలా జర్నలిస్టులకు ప్రత్యేక సౌకర్యాల కల్పించాలని జర్నలిస్టులకు వెజ్ బోర్డ్ అమల చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ను కోరినట్లు తెలిపారు.