ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
జగిత్యాల: ప్రమాద రహిత వారోత్సవాల సందర్భంగా ఉత్తమ డ్రైవర్లకు శనివారం నాడు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల డిపోలో జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలు అన్నీ కూడా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని అన్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన మానసిక స్థితిని సరిగ్గా ఉంచుకొని ప్రశాంతమైన మనసుతో వాహనం నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరగవని అన్నారు. తరచుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు 30 ఏళ్లలోపు యువకులేనని అన్నారు. యువత అర్ధాంతరంగా మరణించడంతో వారి కుటుంబాల్లో అంతులేని శోకం నెలకొని ఉంటుందని ప్రతి డ్రైవర్ రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు గాని పాదచారులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వాహనాలు నడిపి ప్రమాదాలు నివారించాలని కోరారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదాలు చేయకుండా విధులు నిర్వహిస్తున్న అత్యుత్తమ డ్రైవర్లను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేతులమీదుగా సన్మానించారు.