డియస్సి కార్యాలయం ముట్టడించిన ఉపాద్యాయులు:టీపీటీఎఫ్
హైదరాబాద్: ఉపాధ్యాయ – విద్యారంగంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డి ఎస్ ఇ) కార్యాలయ ముట్టడి కార్యక్రమంను నిర్వహించారు. ఈ ముట్టడిలో పాల్గొనడానికి టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ నుండి జిల్లా అధ్యక్షులు బోగ రమేష్ , జిల్లా ప్రధానకార్యాదర్శి దాసరి రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కొక్కుల రాంచంద్రం, కూరగాయల చంద్రశేఖర్, ఎడ్ల గోవర్ధన్ లు హైదారాబాద్ కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన చేపట్టామని, ప్రభుత్వం స్పందించకపోవడంతో డిఎస్ఇ ముట్టడి చేపట్టామన్నారు. గత ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకుండా ఎంతోమంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నారని, అంతర జిల్లా బదిలీలు చేపట్టకపోవడం, సాధారణ బదిలీలు లేకపోవడం మూలంగా అనేకమంది అవస్థలు పడుతున్నారని, పాఠశాలల్లో పారిశుద్ధ్య పనివారు లేకపోవడంవల్ల పాఠశాల పారిశుద్ధ్యం కొన్ని చోట్ల ఉపాధ్యాయులు చేయవలసి వస్తుందని, హేతుబద్దీకరణ పేరుతో పాఠశాలలు మూసివేతను ఆపాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన భౌతిక వసతులు కల్పించాలని, సీపీఎస్ విధానం రద్దుచేయాలని, పీఆర్సీ లోని లోపాలని సవరించాలని, కెజిబివి లోని సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.