జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానంకు అనుకుని ఉన్న ధర్మ సముద్రం చెరువులో గంగాజల,మల్లిక, వందన అనే ముగ్గురు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువతుల ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య పాల్పడిన ముగ్గురు యువతుల్లో ఇద్దరు వివాహితులు కాగా ఒక యువతి ఇంటర్ చదువుతోందని తెలిసింది. ఇరువురి మృత దేహాలు లభ్యం కాగా మరొక యువతి మృతదేహం లభ్యం కాలేదు. దాంతో అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లతో మృత దేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న జగిత్యాల టౌన్ సిఐ కిషోర్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి, కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించగా, పట్టణంలోని గాంధీ నగర్ లో విషాదాన్ని నింపింది. కాగా ముగ్గురు యువతుల ఆత్మహత్య ఘటనను తెలుసుకున్న స్థానిక ప్రజలు ధర్మ సముద్రం చెరువు వద్దకు తండోపతండాలుగా తరలివచ్చారు.