పక్షం రోజులు… మూడు హత్యలు, దాడి ఘటన
భయాందోళనలో ప్రజలు
జగిత్యాల : జగిత్యాల జిల్లా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పక్షం రోజుల వ్యవధిలోనే మూడు హత్యలు, దాడులు జరుగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు దేవస్థానం ధర్మసత్రంలో ఈ నెల 4 న మెదక్ జిల్లా చేగుంట మండలం వీర ముష్టి కి చెందిన మిట్టపల్లి కృష్ణ (55) ను అతని భార్య పోచమ్మ, కొడుకు రాజు, ప్రియుడు జాజు రాజేష్ కలిసి గొంతు నులిమి హత్య చేశారు.
జగిత్యాల పట్టణానికి చెందిన రౌడీ షీటర్ తోట శేఖర్ ను సమిండ్ల మహేష్, వీరబత్తిని సాయికిరణ్ లు ఈ నెల 16 న చికెన్ కొట్టే కత్తితో దారుణంగా హత్య చేశారు.
ఈ రెండు హత్యలను మరువకముందే గొల్లపల్లి మండలం అగ్గిమల్లలో సోమవారం తడవేని వెంకటేష్ (25) ను గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని పంటపొలాల్లో పడేసి వెళ్లడం వంటి సంఘటనతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
అలాగే జగిత్యాల రురల్ పరిధిలోని టి ఆర్ నగర్ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి జరుగడం అందులో ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
జగిత్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో వరుసగా హత్యలు జరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతూ ఎప్పుడు ఎలాంటి సంఘటన వినాల్సి వస్తుందో నని బిక్కు బిక్కు మంటు గడుపుతున్న పరిస్థితులున్నాయి.
రోడ్డు ప్రమాదాలపై ఎల్ ఈ డి స్క్రీన్ తో గ్రామాల్లో అవగాహన కల్పించే పోలీస్ కళాజాత బృందాలు హత్యల వంటి తీవ్ర మైన నేరాలకు శిక్షలను ప్రచారం చేసినట్లయితే హత్యలను కట్టడి చేసే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.