పురాణి పేట పోచమ్మ దేవాలయంలో దొంగతనం. కలవరపెడుతున్న వరుస దొంగతనాలు.
జగిత్యాల : పట్టణంలో ఆలయాలే టార్గెట్ గా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల పట్టణంలోని పురాణి పేటలోకమాథా పొచమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలను గడ్డపారతో తొలగించి లోనికి ప్రవేశించిన దొంగ ఆలయంలోని ప్రధాన హుండీని ఎత్తుకెళ్లాడు. దాని పక్కనే ఉన్న చెట్ల మధ్యలో తీసుకెళ్లిన దొంగ నగదు, నగలు ఎత్తుకెళ్లాడు. ఇదంతా కూడా ఆలయంకు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇటీవలే ఆలయ వార్షికోత్సవ వేడుకలు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో వేసిన వెండి, నగదు, బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దొంగలు ఆలయాల్లో రాత్రి వేళల్లో చొరబడి విలువైన ఆభరణాలు, నగదు, ఇతర కానుకలు ఎత్తుకెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారగా వరుస చోరీలు పట్టణ ప్రజలను కలవరపెడుతున్నాయి. రాత్రివేళల్లో పోలీసులు గస్థీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న రామాలయంలో గడిచిన రెండు సంవత్సరాల్లో 7సార్లు దొంగతనం జరిగింది. కొన్ని నెలల క్రితం విద్యానగర్ రామాలయం లో దొంగలు చొరబడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మంచినీళ్ళ భావి సమీపంలోని దగ్గులమ్మ గుడిలో కూడా దొంగతనం జరిగింది. కాగా తాజాగా సోమవారం పట్టణంలోని పురాని పెట్ లో గల గాజుల పోచమ్మ ఆలయంలో దొంగతనం జరుగడం చర్చనీయాంశంగా మారింది. ఆలయాలే టార్గెట్ గా దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడు తుండగా జగిత్యాలలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ఆపరేషన్ చబుత్రా వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లయితే వరుస దొంగతనాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.