ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన మేదర సంఘం రాష్ట్ర నాయకులు.
జగిత్యాల: మేదర కులస్తుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర మేదరి సంఘం బృందం మంగళవారం జగిత్యాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మేదరులకు సొసైటీల ద్వారా సబ్సిడీ వెదురు 3 రూపాయలకే సరఫరా చేసేవారని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెదురు బొంగుల ధర పదింతలు పెరిగి 30 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. దీనితో మేదరుల పరిస్థితి దయనీయంగా తయారయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుందని కానీ మేదరుల జీవనాధారమైన వెదురు పై అనేక ఆంక్షలు విధించిందని ఆవేదన వెల్లిబుచ్చారు. దీనితో తెలంగాణలో మేదరులు కులవృత్తిలో కొనసాగలేక జీవనోపాధి లేక నానా ఇబ్బందులకు గురౌతున్నారని వాపోయారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ సహజ వనరులైన అడవులు, చెరువులు మరియు గుట్టలపై ఆధారపడి జీవించే కులాలకు ఆ వనరులపై పూర్తి హక్కులు కల్పించాలని, గంగపుత్రులకు చెరువులపై హక్కు, ముదిరాజులకు కొండలపై హక్కు, గౌడ కులస్తులకు ఈత తాటిచెట్లపై పూర్తి హక్కులు కల్పించినట్లు మేదరులకు అడవిలో పెరిగే గడ్డిజాతికి చెందిన వెదురుపై పూర్తి హక్కులు కల్పించి, ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. హిందు సమాజ మనుగడకు చాకలి, మంగళి, మేదరి మరియు కుమ్మరి కులాలు ముఖ్యంగా ముందుంటాయని ఏ శుభ అశుభ కార్యాలు జరిగినా ఈ నాల్గు కులాల సేవలు అత్యవసరమని గుర్తుచేశారు. మేదరుల న్యాయబద్దమైన డిమాండ్ల పరిష్కారం విషయంలో ముందుండి కొట్లాడుతానని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మేదరులకు హామీ ఇచ్చారు. జగిత్యాల పట్టణ అధ్యక్షులు చింతల గంగాధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీ ని కలిసారు. ఈ కార్యక్రమంలో మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు వెంకట్ రాముడు, ప్రధాన కార్యదర్శి జొర్రిగల శ్రీనివాస్ రాష్ట్ర కోషాదికారి ఏకుల సత్యం, రాష్ట్ర కార్యదర్శి అలిపిరెడ్డి లచ్చయ్య, జిల్లా అధ్యక్షులు చింత రమేష్, పట్టణ గౌరవ అధ్యక్షులు పిల్లి కిషన్, గౌరవ సలహాదారు వేముల నర్సింగం, ఉమ్మడి జిల్లా వెదురు సొసైటీ అధ్యక్షులు కొన శ్రీనివాస్, యువజన కోషాదికారి పిట్టల శ్రీనివాస్, యువజన అధ్యక్షులు గైని శ్రావన్, మాజీ అధ్యక్షులు చింత గంగారాం, చింత రాజనర్సయ్య, పిల్లి బాలకృష్ణ, పోతు నర్సింగం, బొమ్మిడి నరేష్ పాల్గొన్నారు