Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

మహిళలపై క్రూరత్వం – పసి పిల్లలపై జులుం సబబేనా? : చుక్క గంగారెడ్డి

Chukka Gangareddy

Chukka Gangareddy , mana jagtial news

అల్లకల్లోలంలో ఆగమై పోతున్న నా బుగ్గారం

ఆదుకోవాల్సిన అధికారులే సమస్యలను సృష్టిస్తారా….?

చట్టానికి ఎవరూ చుట్టం కాదు – అధికారులూ చట్టపరిధిలోనే పని చేయాలి

బాధితులకు అండగా నిలబడి చట్టపరంగా న్యాయపోరాటం చేస్తాం

మానవ హక్కుల కమీషన్, బాలల హక్కుల కమీషన్, మహిళా కమీషన్ లను ఆశ్రయిస్తాం

తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి

జగిత్యాల జిల్లాలో ఐదేండ్ల క్రితం నూతన మండల కేంద్రంగా ఏర్పడ్డ నా “‘బుగ్గారం”‘ అల్లకల్లోలంలో ఆగమైపోతుందని, శాంతిభద్రతలతో కాపాడాల్సిన అధికారులే సమస్యలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులైన తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎంతో కాలంగా బుగ్గారం లో అనేక రకాల కుట్రపూరిత చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వీటిపై అధికారులకు, ఉన్నతాధికారులకు ఎన్నెన్ని పిర్యాదులు చేసినా ఏకపక్షంగా వ్యవహరిస్తూ చట్టాలను, రాజ్యాంగాన్ని తుంగలో త్రొక్కుతూ సామాన్య ప్రజలకు, నిరుపేదలకు, బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
స్థానికంగా పనిచేస్తున్న గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు, పోలీసులు కూడా కొందరి చెప్పుచేష్టల్లో పని చేస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు, అన్యాయాలకు గురిచేస్తున్నారని ఆయన వివరించారు. అధికారులు, ఉద్యోగులు, పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలి కానీ, చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా ఏక పక్ష నిర్ణయాలకు పనిచేయడం సబబు కాదన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని – అధికారులైనా, ఉన్నతాధికారులైనా, పాలకులైనా, ఎవరైనా చట్టానికి లోబడి పనులు చేయాలని ఆయన సూచించారు.
తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలకు బలి కావాల్సి వస్తుందన్నారు. ఇకనైనా బుగ్గారం గ్రామ స్థాయి, మండల స్థాయిలో పని చేసే ఉద్యోగులు,
అధికారులు, ఇతర వ్యక్తులకు ఎవరికీ కూడా బానిసలు కాకుండా రాజ్యాంగ బద్దంగా, చట్టపరంగా ప్రజలకు సేవలు అందించి ప్రజల మెప్పు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒత్తిళ్ళతో ఉద్యోగ రీత్యా వృత్తిలో మీ తప్పులు దొర్లి చట్టపరంగా మీరు శిక్షింప బడితే, మీ ఉద్యోగాలకు ఎసరు వస్తే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు అనే సంగతి ఉద్యోగులు, అధికారులు మర్చిపోకూడదు అని ఆయన సూచించారు.

ఈమధ్య కాలంలో బుగ్గారం లో జరుగుతున్న అల్లకల్లోల పరిస్థితులపై అధికారులే పూర్తి బాధ్యులని ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రైతు వేదికపై రంగులు పూసిన సంఘటనలో దోషులను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని ఆయన పోలీసులను
ప్రశ్నించారు. ఇందుకారణంగా వందలాది మంది పోలీస్ సిబ్బందితో, పోలీస్ ఉన్నతాధికారులు సైతం మూడు – నాలుగు రోజులు భారీ బందోబస్తు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. అలాగే బుగ్గారం శివారులోని 516 సర్వే నంబర్ లో నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణి ల భూమిలోనే బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మించతలపెట్టడం సబబు కాదన్నారు. అధికారులు – ఉన్నతాధికారులు ముందస్తుగా వారికి చట్టపరమైన నోటీసులు ఎందుకు జారీ చేయలేకపోయారని ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు. 516సర్వే నంబర్ లో 36మందికి పట్టా పాసుపుస్తకాలు ఉంటే కేవలం ఈ ముగ్గురు మహిళా రైతులనే ఎందుకు టార్గెట్ చేశారని ఆయన ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే 36మంది రైతులకు నోటీసులు జారీ చేసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పోలీసులు మూకుమ్మడిగా ఈ ముగ్గురు మహిళా రైతు కుటుంబాలపై జులుం ప్రదర్శించడం, మహిళలపై తీవ్రంగా విరుచుకు పడడం, పసి పిల్లలను కూడా తీవ్ర భయబ్రాంతులకు గురిచేయడం, ఇలా కుట్రపూరితంగా వ్యవహరించి, వారి పంటపొలాల నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా బలవంతంగా కిడ్నాప్ విధానంలో అరెస్టులు చేయడం సబబుకాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజలను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంలో అంతర్యం ఏమిటని చుక్క గంగారెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలబడి తగు న్యాయం కోసం మహిళా కమీషన్ ను, బాలల హక్కుల సంఘం (కమీషన్) ను, మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయిస్తామని చుక్క గంగారెడ్డి వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో బాధిత మహిళా రైతులు నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణి, నగునూరి లక్ష్మీ, నగునూరి చిన్న రామగౌడ్, నర్సాగౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version