నులి పురుగు నిర్ములన మాత్రల పంపిణీ ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల: నులి పురుగు నిర్ములన మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్ములన కార్యక్రమంలో భాగంగా 1 నుండి 19 సం,, లోపు పిల్లలకు అల్బెన్దజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని జగిత్యాలలోని మిషన్ కాంపౌండ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూజాతీయ నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో వారం రోజుల పాటు నులిపురుగు నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2 లక్షల 65 వేల మంది పిల్లలు ఉన్నారని వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా అందజేయాలని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కలిసి పని చేయాలని అప్పుడే అనుకున్నా లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని అందువల్ల తొలి దశలో నివారించే వ్యాధులకు అవసరమైన మందులను అధికారులు పిల్లలకు అందజేయాలని తద్వారా పిల్లలు బలవంతులుగా తయారవుతారని రాబోయే రోజుల్లో దేశానికి యువతనే కీలకమని ఈసందర్భంగా అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరంభం ఆర్భాటం కాకుండా వారం రోజుల పాటు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క అధికారిని కోరుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను పంపిణీ చేస్తుందని అధికారులు ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం చేయాలని అప్పుడే ప్రజలకు ఉపయోగకరమని అన్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో నివారణ లో భాగంగా భారతదేశంలో రోటరీ క్లబ్ ను భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఈనాడు పోలియో రహిత దేశంగా తయారయిందని, గత 5 సంవత్సరాలుగా పోలియో కేసులు నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రోటరీ క్లబ్ సంయుక్తంగా కలిసి పనిచేయడం వల్ల సాధ్యమైందని, నులి పురుగు నివారణ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు గా కలిసి పని చేయడం ద్వారా జిల్లాలో పిల్లలందరికీ అందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డియం హెచ్ఓ శ్రీనివాస్, డిప్యూటీ డియం హెచ్ఓ జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ కోరే గంగమల్లు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.