జీఓ 25 ను ఉపసంహరించాలి: టీపీటీఎఫ్
జగిత్యాల: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ- విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ జగిత్యాల అర్బన్, రూరల్ మండల తహాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోగ రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవోలను వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కరువై గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకు దూరమై పోయే ప్రమాదం ఉందని, ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని,
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, బడులను బలోపేతం చేసి, బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం చేకూర్చాలని, గత ఆరు సంవత్సరాలుగా విద్యాశాఖలో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తోందని, ఇప్పటికైనా వెంటనే పదోన్నతులు చేపట్టి ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ, ఎంఇఓ,డిప్యూటీ ఈవో ,డి ఈ ఓ ఖాళీలను భర్తీ చేయాలని,బదిలీల షెడ్యూలు విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి 2003 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరికీ ఓపిఎస్ ను అమలు చేయాలని, కేజీబీవీ సిబ్బందికి కనీస వేతన స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ రాష్ట్ర నాయకులు సూద రాజేందర్ రాష్ట్ర కౌన్సిలర్ గొడుగు రఘుపతి యాదవ్ జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వేల్పుల బాలయ్య , హాబీబుద్దిన్, కూరగాయల చంద్రశేఖర్, గాలి పెళ్లి చంద్రమౌళి, హాజీ అహ్మద్, వేముల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.