ఆత్మీయంగా పెంచుకున్న శునకం మృతిచెందడంతో దానికి 12 వ రోజున పెద్దకర్మ నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు. జగిత్యాల పట్టణంలోని విద్యా నగర్ కు చెందిన కాలగిరి శ్రీనివాస్ రెడ్డి- సుమ దంపతులు గత ఆరేళ్లుగా మిల్కీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గతనెల 21న మృతి చెందింది. దానికి మూడు, ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు బుధవారం 12వ రోజు పెద్ద కర్మను నిర్వహించి శునకం పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. తమ ఇంట్లో ఒకరిగా ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్న శునకం తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందని గృహిణి కాలగిరి సుమ తెలిపారు. తమ అభిమాన ప్రీతిపాత్రమైన శునకం మృతిచెందడంతో తట్టు కోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటికి రక్షణగా ఉన్న శునకం మృతి చెందడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని వారు అభిప్రాయపడ్డారు. గురువారం శునకానికి పెద్దకర్మ నిర్వహించి పలువురికి భోజనాలు సైతం వడ్డించారు. మనుషుల మద్య ఈర్ష్య ద్వేశాలు పెరిగి మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో శునకానికి సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించి పెద్దకర్మ జరపడం విశేషం.