ప్రపంచ వెదురు దినోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్పర్సన్.
జగిత్యాల: ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదరి సంఘం పట్టణాధ్యక్షులు చింతల గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జగిత్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ.. యాంత్రిక ప్రపంచంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడం వల్ల వెదురు వస్తువులకు ఆదరణ తగ్గిపోయిందని, అధునాతన వెదురు వస్తువుల తయారీలో నైపుణ్య శిక్షణ కరువవ్వడం, అటవీశాఖ అధికారులు ఆంక్షలతో మేదరులు కులవృత్తిలో మనలేకపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ మేదరులకు ప్రధాన వనరు ఐన వెదురు విరివిగా ఉన్న ఖమ్మం జిల్లాలోని సీలేరులోని ఏడు మండలాలు ఆంద్రకు తరలిపోయాయని దీనితో వెదురు కొరత ఏర్పడిందని అన్నారు. అలాగే తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో ఎక్కువగా వెదురు మొక్కలు నాటడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బిసి కులాల అభివృద్ధికి ఎన్నో పథకాలతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేదరుల వెదురు సొసైటీలు రద్దు చేశారు. దీనితో సబ్సిడీ వెదురు పంపిణీ ఆగిపోవడంతో మేదరుల వృత్తి నానాటికి అన్యాక్రాంతమై పోతుంది. గౌడ కులస్తులకు తాటి ఈత చెట్లపై పూర్తి హక్కులు కల్పించినట్లు వెదురుపై మేదరులకు హక్కులు కల్పించాలన్నారు. కల్లు వినియోగం తగ్గిపోతున్నందున రాష్ట్రంలో వైన్సుల కేటాయింపులో గౌడకులస్థులకు 14% రిజర్వేషన్ కల్పించిందని అలాగే మేదరులకు కూడా వెదురు సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగ రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతలు మాట్లాడుతూ వ్యవసాయరంగం యాంత్రికమయ్యాక వెదురు పనివారలు ఉపాధి కోల్పోతున్నారని కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో మేదర సంఘం అధ్యక్షులు చింతల గంగాధర్, ఉపాధ్యక్షుడు వేముల సునీల్, ప్రధాన కార్యదర్శి పోతు కృష్ణ, కోషాదికారి వేముల వంశీకృష్ణ, కార్యదర్శి చింత రాజేశం గౌరవాధ్యక్షులు పిల్లి కిషన్, మామిడిపెల్లి కృష్ణ ప్రసాద్, వేముల రాములు, సంద లక్ష్మణ్, చింత నర్సింగం, పిల్లి లింగన్న, పాలారపు దేవదాసు, గోవర్ధన్, నర్సయ్య, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.