GeneralJagtial NewsLatest

మన ధర్మమే మనలను రక్షిస్తుంది : సద్గురు మహాదేవ స్వామి

మాతలచే వైభవంగా కుంకుమార్చనల పూజలు.

శాస్త్రోక్తంగా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం.

వైభవంగా పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు.

జగిత్యాల: మన ధర్మమే మనలను రక్షిస్తుందని సద్గురు మహాదేవ స్వామి అన్నారు. నాలుగు రోజులపాటు జరిగే పోచమ్మ తల్లి 59 వ వార్షికోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం ఆలయంలో మాతలచే వైభవంగా కుంకుమార్చన శాస్త్రోక్తంగా లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం జరిగాయి. ఈ సందర్భంగా సద్గురు మహాదేవ స్వామి మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మన దేశ ధర్మమే విశేషంగా పాలుపంచుకుంతుందన్నారు. ప్రతి మనిషి ధర్మాన్ని పాటించాలని మన ధర్మమే మనల్ని రక్షిస్తుందని ధర్మమార్గంలో నడుచుకోవడమే మన లక్ష్యం కావాలన్నారు. కొలిచిన భక్తులకు బ్రోచే అమ్మగా విలసిల్లుతున్న పోచమ్మ తల్లి ఆలయంలో గత యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఉత్సవాలను వైభవంగా జరపడం హర్షణీయమన్నారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజుల రాజేందర్ తో పాటు సభ్యులను అభినందించారు. అనంతరం వేద పండితులు శ్రీమాన్ వేణుగోపాల చారి కౌశిక మాట్లాడుతూ ఆదిపరాశక్తి అంశతో జగిత్యాల పట్టణంలో స్వయంభూగా వెలిసిన పోచమ్మ తల్లి ఉత్సవాలు జరపడం మనలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లికి మనం కృతజ్ఞత చెప్పినట్లే అన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారమై మనసుతో ఆరాధించిన వారిని అక్కున చేర్చుకునే చల్లని తల్లిగా ఆరాధింపబడుతున్న పోచమ్మ తల్లి దీవెనలు కలకాలం ఉంటాయని అన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరపడం ఈ కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆపద సమయంలో భక్తులను కాపాడే అమ్మగా వెలసిన గ్రామ దేవత పోచమ్మగా కీర్తించబడుతున్న గ్రామ దేవత బ్రోచమ్మ గా కీర్తించబడుతూ కాలక్రమంలో పోచమ్మ గా జగిత్యాల భక్తులచే నిత్య పూజలందుకోవడం కొనియాడదగిందని అన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ ఈ వార్షికోత్సవాలలో అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పోచమ్మ తల్లి ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు, ముడుపులు చెల్లించుకుని అమ్మవారి కరుణ కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రావణ మాసం సందర్భంగా 1,116 తామరపూలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం వరకు నిరంతర భజన కార్యక్రమాలు అమ్మవారి విశేషార్చనలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ నిర్వాహకులు నాగమల్ల మనోహర్, సంగెం సంఘం విద్యాసాగర్, జనగామ గంగాధర్, ములస్థం మల్లికార్జున్ , వడ్డూరి హరి, అంగడి మఠం సదాశివ్, డాక్టర్ గాజోజు రాజ గోపాల చారి, రాఘవాచారి తో పాటు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.