హత్యాచారానికి పాల్పడ్డ నిందితున్ని ప్రజల మధ్య ఉరి తీయాలి
కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా
ప్రభుత్వాలు, పాలకులు స్పందించక పోవడం సిగ్గుచేటు
పెద్దలకు ఒక న్యాయం – పేదలకు ఒక న్యాయమా…?
జగిత్యాల, సెప్టెంబర్ 14: హైదరాబాద్ నగరంలో ఆరేండ్ల చిన్నారి పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుణ్ణి ప్రజల మధ్య ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రజాసంఘాల అధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కులమతాల కతీతంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అతి చిన్న వయస్సు గల ఆరేండ్ల చిన్నారిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగం అయిన నిందితున్ని యావత్ ప్రజా నీకం మధ్య శిక్షించి ఉరి తీయాలన్నారు. మరో వ్యక్తి ఇలాంటి క్రూరమైన చేష్టలు చేయాలన్నా, మరో మహిళ వైపు, ఆడపిల్ల వైపు చూడాలన్నా భయపడేలా శిక్షలు విధించాలని ప్రభుత్వాలను, న్యాయస్థానాలను వారు కోరారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేద, బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వారికి ఒక న్యాయమా అని వారు ప్రశ్నించారు. ఇంత క్రూరంగా జరిగిన చిన్నారి సంఘటనపై ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. సినీ హీరో కు ప్రమాదం జరిగితే స్పందించిన ప్రముఖులు, పాలకులు చిన్నారి సంఘటనలో ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించడం లో అంతర్యం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గాజుల నాగరాజు, పులి నరసయ్య, చింత సుదీర్, చింత రోజా, చుక్క గంగారెడ్డి, ఎస్కె ఫిరోజ్, కళ్యాణ్, నరేష్, ఆసిఫ్, రమేష్, ఆలిం, ఎస్.కె హుస్సేన్, వెంకటేష్, ఎస్కే సమీర్, రాజు, వంశీ, నాగరాజు, సలీం, హుస్సేన్,, మురళి, ఖాలిద్, ఫిరోజ్, ఫాజిల్, మధు, హస్మద్, ఇస్మాయిల్, కుల్దీప్ సింగ్, ఈశ్వర్, కిరణ్ సింగ్, లక్ష్మణ్, పృద్వి, వాజీద్, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.